: రంగంలోకి దిగిన సురేష్ ప్రభు...1000 కోట్లతో 20 స్టేషన్ల ఆధునికీకరణ
తనదైన శైలిలో రైల్వేల్లో సంస్కరణలు చేపడుతున్న కేంద్ర మంత్రి సురేష్ ప్రభు... ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం కల్పించినందుకు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర రైల్వే శాఖ నుంచి ఏపీకి కల్పించనున్న సౌకర్యాలను వివరించారు. వెయ్యి కోట్ల రూపాయలతో రాష్ట్రంలోని 20 రైల్వే స్టేషన్లను విమానాశ్రయాల స్ధాయిలో సరికొత్తగా ఆధునికీకరిస్తామని అన్నారు. ఇప్పటికే ఏపీ రూట్లలో 22 వేల కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. ఐఆర్సీటీసీ వెబ్ సైట్ ద్వారా మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన తెలిపారు. దేశంలో అత్యధికులు వీక్షిస్తున్న ఐఆర్సీటీసీ ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని ఆయన పేర్కొన్నారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు ప్రణాళికలు సిధ్ధం చేస్తున్నామని ఆయన చెప్పారు. అందులో భాగంగా ఐఆర్సీటీసీ మరింత సమర్ధవంతంగా పనిచేస్తుందని భావిస్తున్నానని ఆయన తెలిపారు. అలాగే పుష్కరాలకు అవసరమైన రైళ్లను నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. ఏపీ రవాణా హబ్ గా తయారవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.