: 3 శాఖలు 30కి పెరిగాయి!... నవ్యాంధ్ర రాజధానికి క్యూ కడుతున్న బ్యాంకులు!
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి ముందు బ్యాంకులు బారులు తీరుతున్నాయి. రాజధాని ప్రకటనకు ముందు తుళ్లూరు, ఆ చుట్టుపక్కల మరో 29 గ్రామాలకు కలిపి కేవలం రెండంటే రెండు బ్యాంకు శాఖలుండేవి. అయితే తుళ్లూరు కేంద్రంగా అమరావతి పేరిట నూతన రాజధానిని ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతం తుళ్లూరు సహా రాజధాని పరిధిలోని గ్రామాల్లో బ్యాంకు శాఖల సంఖ్య 30కి చేరింది. వీటిలో ఒక్క తుళ్లూరులోనే 15 బ్యాంకు శాఖలు ఉన్నాయి. ఇక ఆయా బ్యాంకులు తమ శాఖలను ఏర్పాటు చేయడంతో పాటు ఏటీఎం కేంద్రాలను కూడా ఏర్పాటు చేశాయి. ప్రస్తుతం అమరావతి పరిధిలో మొత్తం 18 ఏటీఎంలున్నాయి. డిపాజిట్లు బాగానే వస్తున్న క్రమంలో రాజధాని రైతులు అడిగిందే తడవుగా ఆయా బ్యాంకులు రుణాలను మంజూరు చేస్తున్నాయట. ప్రస్తుతం రాజధానిలో ఏర్పాటైన బ్యాంకు శాఖల వివరాల్లోకెళితే... ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోస్టల్ బ్యాంకు, ఆంధ్రా బ్యాంకు, విజయా బ్యాంకు, గోదావరి చైతన్య గ్రామీణ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిండికేట్ బ్యాంకు, కెనరా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సౌత్ ఇండియన్ బ్యాంకు, సిటీ యూనియన్ బ్యాంకు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, హెచ్ డీఎఫ్సీ, ఐసీఐసీఐ తదితర బ్యాంకులు తమ శాఖలను అమరావతి పరిధిలో ఏర్పాటు చేశాయి.