: చంద్రబాబుకి బుద్ధి, జ్ఞానం ఉన్నాయా..?: ‘అనంత’లో వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలోని కదిరి నుంచి తన రైతు భరోసా యాత్రను కొనసాగిస్తూ అక్కడి ఎన్‌పీ కుంటకు చేరుకున్నారు. ఎన్‌పీ కుంట మండలంలో సోలార్ విద్యుత్ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయి పరిహారం లభించని బాధిత రైతులతో జగన్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్‌పీ కుంటలో 7500 ఎకరాలు సోలార్ ప్లాంట్ కోసం ప్రభుత్వం ధారాదత్తం చేసిందని, భూములను కోల్పోయిన రైతులు అష్టకష్టాలు పడుతున్నారని అన్నారు. ‘ఈరోజు దారుణమైన పరిస్థితి నెలకొంది.. సోలార్‌లో భూములు కోల్పోయిన వారికి ఉద్యోగాలిస్తామన్నారు. ఇప్పుడు పట్టించుకోవడంలేదు. పరిహారం ఇస్తామన్నారు.. ఇప్పుడు ఆ ముచ్చటే లేదు. చంద్రబాబుకి బుద్ధి, జ్ఞానం ఉన్నాయా..? పేదలంటే చంద్రబాబుకి ఎందుకింత కోపం?’ అని జగన్ వ్యాఖ్యానించారు. ‘చంద్రబాబుకి ఎప్పటికైనా జ్ఞానం వస్తుందని ఆశిద్దాం’ అని ఆయన అన్నారు. ‘నీళ్లున్న చోట సోలార్ ప్లాంట్ కట్టడమేంటీ..?' అని జగన్ ప్రశ్నించారు. ‘లక్ష రూపాయలు పరిహారం ఇస్తామన్నారు. పైసా ఇవ్వలేదు.. వ్యవసాయం చేయాలనుకుంటోన్న రైతుల పొట్టకొట్టారు.. చంద్రబాబుకి మనసు, మానవత్వం ఉన్నాయా..?’ అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సోలార్ ప్లాంట్‌లో ఉద్యోగాలు వస్తాయనుకున్న నిరుద్యోగులకు నిరాశే మిగిలింది’ అని ఆయన అన్నారు. భూములు కోల్పోయిన వారికి రూ.3.25 లక్షల పరిహారం వర్తింపు చెయ్యాలని డిమాండ్ చేశారు. వారికి న్యాయం జరిగే వరకు పోరాడతానని హామీనిచ్చారు.