: దోపిడీదారులంతా ఒక్కటైతే పరిస్థితి ఎలా ఉంటుందో ఏపీలో వాతావరణం అలా ఉంది: భూమన
‘ప్రపంచంలోని దోపిడీ దారులంతా ఒక్కటైతే పరిస్థితి ఎలా ఉంటుందో ఏపీలో వాతావరణం అలా ఉంది’ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ.. తమ అధినేత జగన్ ప్రజా సమస్యలపై పోరాడుతోంటే టీడీపీ నేతలు ఆయననే టార్గెట్ గా చేసుకొని తీవ్రమైన విమర్శలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దోపిడీ దారులంతా ఏకమై జగన్ పై పలు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన అన్నారు. రైతుల రుణమాఫీ అంశాన్ని చంద్రబాబు గాలికి వదిలేశారని ఆయన ఆరోపించారు. ఏపీ ప్రభుత్వంపై ప్రజల అసంతృప్తే జగన్ మాటల ద్వారా వచ్చింది అని ఆయన అన్నారు. 'జగన్ వ్యక్తిత్వం మీద నిరంతరం దాడి చేయడమే లక్ష్యంగా చంద్రబాబు, ఏపీ మంత్రుల తీరు ఉంది' అని భూమన అన్నారు. వైఎస్ కుటుంబానికే చంద్రబాబుపై పోరాడే శక్తి ఉందని గ్రహించి జగన్‌పై విమర్శలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ‘జగన్‌ని ఒక సైకో, పిచ్చివాడు అంటున్నారు.. ప్రజా సమస్యలపై పోరాడుతున్నందుకు ఇన్ని వ్యాఖ్యలు చేస్తారా..?' అని ఆయన ప్రశ్నించారు. తానిచ్చిన హామీల్లో చంద్రబాబు ఒక్క హామీని కూడా ఇంతవరకు నెరవేర్చలేదని ఆయన అన్నారు. అసెంబ్లీలోనూ ప్రజా సమస్యలపై చర్చించేందుకు వైసీపీకి ఒక్కరోజు కూడా అవకాశం ఇవ్వలేదని ఆయన అన్నారు.