: కందికుంట అరెస్ట్!... కదిరి పోలీస్ స్టేషన్ ను ముట్టడించిన టీడీపీ కార్యకర్తలు


వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర అనంతపురం జిల్లాలో హైటెన్షన్ వాతావరణానికి తెర తీసింది. మొన్నటి యాత్రలో భాగంగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిని చెప్పులతో కొట్టాలంటూ జగన్ చేసిన వ్యాఖ్యలతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు నేటి ఉదయం కదిరిలో హైటెన్షన్ వాతావరణాన్ని సృష్టించాయి. నిన్న రాత్రికే కదిరి చేరుకున్న జగన్... అక్కడి ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో బస చేశారు. నేటి ఉదయం ఆయన యాత్రకు బయటకు రాకముందే కదిరి నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జీ కందికుంట వెంకటప్రసాద్ తన అనుచరులతో కలిసి అక్కడకు చేరుకున్నారు. తాను చేసిన అనుచిత వ్యాఖ్యలకు చంద్రబాబుకు జగన్ సారీ చెబితేనే యాత్రకు అనుమతిస్తామని కందికుంట తేల్చిచెప్పారు. అక్కడే బైఠాయించారు. ఈ సందర్భంగా తమను అడ్డుకునేందుకు వచ్చిన వైసీపీ కార్యకర్తలతో కందికుంట వర్గీయులు వాగ్వాదానికి దిగారు. పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించిన పోలీసులు కందికుంటను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో భగ్గుమన్న టీడీపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ చేరుకుని కందికుంటను విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న కందికుంట వర్గీయులు ఒకానొక సందర్భంలో పోలీస్ స్టేషన్ ను ముట్టడించేందుకు యత్నించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News