: ఫిర్యాదుల సమయం!... ఏపీపై కేంద్రానికి కంప్లెయింట్ చేసేందుకు ఢిల్లీకి హరీశ్!


తెలుగు రాష్ట్రాల మధ్య సాగునీటి ప్రాజెక్టుల విషయంలో నెలకొన్న వివాదం మరింత ముదిరే ప్రమాదం కనిపిస్తోంది. ప్రధానంగా కృష్ణా నదిపై తెలంగాణ సర్కారు నిర్మించతలపెట్టిన పాలమూరు- రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు అక్రమమంటూ ఏపీ వాదిస్తోంది. ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణంతో రాయలసీమ ఎడారిగా మారే ప్రమాదముందని ఆ ప్రాంత వాసులతో పాటు చంద్రబాబు ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే ఈ రెండు ప్రాజెక్టులకు ఉమ్మడి రాష్ట్రంలోనే అనుమతి వచ్చిందని, వీటి నిర్మాణంపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తెలంగాణ సర్కారు చెబుతోంది. ఈ క్రమంలో తెలంగాణపై ఏపీ సర్కారు ఇప్పటికే కృష్ణా రివర్ బోర్డుతో పాటు కేంద్రానికి కూడా ఫిర్యాదు చేసింది. ఏపీ వాదనలను తిప్పికొట్టే బాధ్యతను తెలంగాణ సీఎం కేసీఆర్... తన మేనల్లుడు, భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావుకు అప్పగించారు. కేసీఆర్ ఆదేశాలతో పార్టీ ఎంపీలతో కలిసి హరీశ్ రావు నేటి సాయంత్రం ఢిల్లీ పర్యటనకు బయలుదేరుతున్నారు. తమ వాదనను బలపరిచే పలు ఆధారాలను తీసుకుని ఢిల్లీ విమానం ఎక్కనున్న హరీశ్ రావు... ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతిని కలవనున్నారు. ఏపీ అసత్య ప్రచారం చేస్తోందని ఆయన ఉమా భారతికి ఫిర్యాదు చేయనున్నారు.

  • Loading...

More Telugu News