: ‘ఎయిర్ టెల్’ లక్కీ డ్రా పేరిట మహిళకు టోకరా
‘ఎయిర్ టెల్’ లక్కీ డ్రా పేరిట ఒక మహిళను నమ్మించి రూ.5 లక్షలు కాజేసిన పశ్చిమబెంగాల్ వ్యక్తిని హైదరాబాదు, సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి డీసీపీ అవినాష్ మహంతి తెలిపిన వివరాలు... హైదరాబాద్ లోని సత్తార్ బాగ్ కు చెందిన జమీలా బేగంకు కొందరు వ్యక్తులు ఇటీవల ఫోన్ చేశారు. రంజేష్, బాలాజీ, ప్రతాప్ సింగ్, శిరీష్ పాండేలుగా వారు తమను పరిచయం చేసుకున్నారు. ‘ఎయిర్ టెల్’ లక్కీ డ్రాలో జమీలా బేగం ఫోన్ నంబర్ ఎంపికైందని, బహుమతి కింద రూ.25 లక్షలు వచ్చాయని ఆమెకు చెప్పారు. ఈ మాటలు నమ్మిన జమీలా బేగం నిందితులు చెప్పినట్లుగా చేసింది. ప్రాసెసింగ్ ఫీజులు, పన్నులు, ఇతర ఛార్జీల పేరుతో వారడిగిన మేర రూ.5 లక్షలు పలు బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ఆ తర్వాత వారి నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో తాను మోసం పోయినట్లు గుర్తించిన జమీలా బేగం పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు, సేకరించిన ఆధారాల ప్రకారం కోల్ కతాకు చెందిన చరణ్ జిత్ దాస్ ను నిందితుడిగా గుర్తించారు. కోల్ కతాకు వెళ్లిన ప్రత్యేక బృందం అతనిని అరెస్ట్ చేసి ఈరోజు హైదరాబాద్ కు తీసుకువచ్చిందని డీసీపీ వివరించారు.