: తెలంగాణ అంటే ఏమిటో దేశం మొత్తం అర్థం కావాలి: సీఎం కేసీఆర్
తెలంగాణ అంటే ఏమిటో దేశం మొత్తం అర్థం కావాలని సీఎం కేసీఆర్ అన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం స్థానిక ప్రజాప్రతినిధులు ఈరోజు టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ పార్టీ బలోపేతం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, తెలంగాణ రాజకీయ ఆలోచనకు ఉపఎన్నికల ఫలితాలే నిదర్శనమని అన్నారు. ఏపీ సరిహద్దు పాలేరులోనూ టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించారని, తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ జరగాలని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. శ్రీరామ్ ప్రాజెక్ట్ ఖమ్మం జిల్లాకు వరప్రదాయిని అని అన్నారు. మున్నేరు వాగుపై చెక్ డ్యాం కట్టుకోకుండా ఆంధ్ర పాలకులు కుట్రలు చేశారన్నారు. మన నీళ్లను మనం వాడుకునే స్వాతంత్ర్యం ఇప్పుడు మనకు వచ్చిందని, కొత్తగూడెం త్వరలో జిల్లాగా మారనుందని కేసీఆర్ తెలిపారు.