: పయ్యావులదీ దేవినేని మాటే!... జగన్ మానసిక స్థితి బాగాలేదన్న టీడీపీ ఎమ్మెల్సీ!
రైతు భరోసా యాత్రలో భాగంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడును చెప్పులతో కొట్టాలని సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేతల ఎదురు దాడి కొనసాగుతోంది. నేటి ఉదయం విజయవాడలో మీడియా ముందుకు వచ్చిన టీడీపీ సీనియర్ నేత, ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ... జగన్ పర్సనాలిటీ డిజార్డర్ తో బాధపడుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాజాగా కొద్దిసేపటి క్రితం హైదరాబాదులో మీడియాతో మాట్లాడిన ఆ పార్టీ మరో సీనియర్ నేత, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ కూడా జగన్ పై విరుచుకుపడ్డారు. జగన్ వ్యాఖ్యలను చూస్తుంటే ఆయన మానసిక పరిస్థితి బాగోలేదని ఆయన చెప్పారు. తొలి నుంచి జగన్ కు మానసికి పరిస్థితి బాగాలేదన్నారు. ఈ కారణంగానే గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఆయనను బెంగళూరు పంపారని తెలిపారు. జైలుకెళ్లి వచ్చినా జగన్ లో మార్పు రాలేదన్నారు. రెక్కలు విరిగిన ఫ్యాన్ ను జగన్ 'ఓఎల్ ఎక్స్'లో పెట్టి అమ్ముకోవాలని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మరోమారు చంద్రబాబుపై నోరు పారేసుకుంటే ప్రజలే జగన్ కు తగిన బుద్ధి చెబుతారని పయ్యావుల హెచ్చరించారు.