: రంగంలోకి చంద్రదండు!... అరెస్ట్ చేసిన పోలీసులు!
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు అండగా నిలవడమే ప్రధాన లక్ష్యంగా అనంతపురం జిల్లాలో ఇటీవలే కొత్తగా రూపుదిద్దుకున్న చంద్రదండు రంగంలోకి దిగిపోయింది. రైతు భరోసా యాత్రలో భాగంగా నిన్న జిల్లాలోని పెద్దవడుగూరులో మీడియాతో మాట్లాడిన సందర్భంగా చంద్రబాబును చెప్పులతో కొట్టాలని సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులకు తెర తీశారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్ ను అడ్డుకునేందుకు ఇప్పటికే 50 వాహనాలతో బయలుదేరిన తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. తాజాగా చంద్రదండు కూడా రంగంలోకి దిగింది. నిన్నటి యాత్రను ముగించుకున్న జగన్... యాడికిలోని వైసీపీ నేత నివాసంలో బస చేశారు. కాసేపట్లో ఆయన అక్కడి నుంచి యాత్రను ప్రారంభించనున్నారు. టీడీపీ నిరసనలతో అప్రమత్తమైన వైసీపీ శ్రేణులు కూడా జగన్ కు మద్దతుగా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నాయి. చంద్రదండు రంగంలోకి దిగిన విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.