: జగన్ ను ఢీకొనేందుకు 50 వాహనాల్లో బయలుదేరిన జేసీ ప్రభాకర్ రెడ్డి!... యాడికిలో 144 సెక్షన్!
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిని చెప్పులతో కొట్టాలని సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు తెర తీశారు. చంద్రబాబుపై జగన్ అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ, ఆయన చేపట్టిన రైతు భరోసా యాత్రను అడ్డుకునేందుకు తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి భారీ అనుచర గణంతో కొద్దిసేపటి క్రితం ర్యాలీగా బయలుదేరారు. మొత్తం 50 వాహనాల నిండా కార్యకర్తలతో జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి నుంచి బయలుదేరారన్న సమాచారం అందుకున్న పోలీసులకు ముచ్చెమటలు పట్టాయి. చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పిన తర్వాతే జగన్ యాత్రను కొనసాగించాలని జేసీ డిమాండ్ చేస్తున్నారు. మరోవైైపు జగన్ ను అడ్డుకుంటే సహించేది లేదని తేల్చిచెప్పిన వైసీపీ శ్రేణులు జగన్ బస చేసిన యాడికికి భారీ సంఖ్యలో తరలివచ్చాయి. ఓ వైపు జేసీ ప్రభాకర్ రెడ్డి తరలివస్తున్నారన్న సమాచారం, మరోవైపు ఆయనను ప్రతిఘటించేందుకు వైసీపీ శ్రేణుల సమాయత్తంతో యాడికిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు రంగంలోకి దిగిన పోలీసు ఉన్నతాధికారులు జేసీ ప్రభాకర్ రెడ్డిని తాడిపత్రి సమీపంలోని చుక్కలూరు వద్దే అడ్డగించారు. ఇక పరిస్థితి చేయి దాటిపోకముందే పోలీసులు యాడికిలో 144 సెక్షన్ ఆంక్షలను అమల్లోకి తెచ్చారు. పోలీసుల హెచ్చరికలతో పట్టణంలోని దుకాణాలన్నీ ఇప్పటికే మూతపడిపోయాయి. దీంతో యాడికితో పాటు అక్కడికి సమీపంలోని పరిసర ప్రాంతాల్లో ఎప్పుడేం జరుగుతుందోనని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.