: అమిత్ షాకు వంటలు వండిందెవరో కనుక్కోండి... పార్టీ కార్యకర్తలకు మాయావతి ఆదేశం


"ఆ వంట వండిందెవరో కనుక్కోండి" యూపీలో బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి, తన కార్యకర్తలకు ఇచ్చిన ఆదేశాలివి. రెండు రోజుల క్రితం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా యూపీలో పర్యటిస్తూ, వారణాసికి సమీపంలోని జోగియాపూర్ గ్రామంలో దళితులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన సంగతి తెలిసిందే. దళితులతో కలిశారంటూ, అమిత్ షాకు దేశవ్యాప్త ప్రచారం రాగా, అక్కడ వంటలు వండింది దళితులు కాదని, అగ్రకులాలకు చెందిన వ్యక్తిని ప్రత్యేకంగా రప్పించి వంటలు వండించారని బీఎస్పీ వాదిస్తోంది. అతి త్వరలోనే వంటగాడిని పట్టుకుని మీడియా ముందు నిలుపుతామని బీఎస్పీ వారణాసి జోన్ ఇన్ చార్జ్ డాక్టర్ రామ్ కుమార్ కురేల్ తెలిపారు. మొత్తం 250 మందితో అమిత్ కలసి రాగా, కేవలం 50 మంది మాత్రమే భోజనం చేశారని, అది కూడా ఫోటోలకు పోజుల కోసమేనని ఆయన ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసమే ఆయన డ్రామా ఆడారని మాయావతి నిప్పులు చెరిగారు. మరో సంవత్సరంలో ఎన్నికలు ఉన్నందునే, బీజేపీ కొత్త ఎత్తులు వేస్తోందని దుయ్యబట్టారు.

  • Loading...

More Telugu News