: కాంగ్రెస్‌కు మరో గట్టి దెబ్బ.. సొంత పార్టీ పెట్టుకోవడానికి అజిత్ జోగి సిద్ధం
ఎన్నో ఏళ్ల చరిత్రగల కాంగ్రెస్ పార్టీకి 2014 సార్వత్రిక ఎన్నికల తరువాత మొదలైన కష్టాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. పార్టీని గట్టెక్కించడానికి రాహుల్ గాంధీని కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించే యోచన చేస్తోన్న ఆ పార్టీ సీనియర్ నేతల నిర్ణయంతో సొంత పార్టీనేతల నుంచి, ప్రతిపక్షాల నుంచి ఎన్నో విమర్శలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఆ పార్టీకి మరో షాక్ తగిలింది. ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ ముఖ్య నేత, మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి ఆ పార్టీకి రాజీనామా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. అంతేకాదు, ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న పార్టీలకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడానికి సొంతంగా ఓ పార్టీని పెట్టే యోచనలో ఆయన ఉన్నారు. అజిత్ జోగి ఛత్తీస్‌గడ్ కాంగ్రెస్‌ను వీడితే ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మనుగడ సాధ్యం కాదని విశ్లేషకుల వాదన. ఈనెల ఆరో తేదీన తన తదుపరి రాజకీయ నిర్ణయంపై, కొత్త పార్టీపై తన మద్దతుదారులతో చర్చించి ఆయన ఓ నిర్ణయం తీసుకోనున్నారు. గతంలో అసోం, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యనేతలు పార్టీని వీడడంతో ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలం ఎంతగా తగ్గిందో తెలిసిన విషయమే. రాహుల్ గాంధీ నాయకత్వం, కాంగ్రెస్ అధిష్ఠానం తీరుపై అలుగుతోన్న నేతలు కాంగ్రెస్ కు గుడ్ బై చెబుతున్నారు.