: యాడికిలో ఉద్రిక్తత!... జగన్ యాత్రను అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తల యత్నం!
అనంతపురం జిల్లాలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిన్న పెద్ద వడుగూరులో మీడియాతో మాట్లాడిన సందర్భంగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిని చెప్పులతో కొట్టాలని అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్ పై జిల్లా టీడీపీ కార్యకర్తల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఈ క్రమంలో నేటి ఉదయం యాడికిలో ప్రారంభమైన జగన్ యాత్రను అడ్డుకునేందుకు పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు రోడ్డెక్కారు. అప్పటికే పరిస్థితిని అంచనా వేసిన పోలీసులు పెద్ద ఎత్తున బలగాలను రంగంలోకి దించారు. జగన్ యాత్రను అడ్డుకునేందుకు యత్నించిన టీడీపీ కార్యకర్తలను అక్కడి నుంచి పంపేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.