: పఠాన్ కోట్ దాడి వెనుక పాక్ ప్రభుత్వం హస్తమున్నట్టు సాక్ష్యాలు లేవు: ఎన్ఐఏ డీజీ


పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై జరిగిన ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ ప్రభుత్వం లేదా ప్రభుత్వ సంస్థల ప్రత్యక్ష హస్తం ఉన్నట్టు తమ వద్ద ఎలాంటి ఆధారాలూ లేవని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్ శరద్ కుమార్ తెలిపారు. పాక్ ఉగ్రవాద సంస్థల జైషే మొహమ్మద్ లేదా మసూద్ అజర్, అతని అనుచరుల ప్రమేయానికి సంబంధించి ఆధారాలేవీ లభించలేదని తెలిపారు. ఇదే సమయంలో ఎయిర్ బేస్ లో ఉన్న ఉద్యోగుల హస్తం ఉన్నట్టు కూడా తేలలేదని వివరించారు. ఈ కేసు విచారణలో భాగంగా పాక్ దర్యాఫ్తు బృందాన్ని ఇండియాలోకి అనుమతించిన సంగతిని గుర్తు చేసిన ఆయన, తమ బృందానికి పాక్ లో పర్యటించి విచారణ జరిపేందుకు ఆ దేశ ప్రభుత్వం నుంచి అనుమతుల కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు. పాక్ అనుమతించకుంటే, ఆ దేశానికి వెళ్లాలన్న ఆలోచన విరమించి, వెంటనే కేసుకు సంబంధించిన చార్జ్ షీట్ దాఖలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కాగా, పాక్ వైపు నుంచి సరిహద్దులు దాటి వచ్చిన ముష్కరులు, జనవరి 1న పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లోకి ప్రవేశించగా, దాదాపు 48 గంటల పాటు సాగిన ఎన్ కౌంటర్ అనంతరం భారత సైన్యం వారిని మట్టుబెట్టిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News