: ప్రేమోన్మాది వీరంగం!... యువతి, ఆమె తల్లిపై కత్తితో దాడి!
అతడిది ఆదిలాబాదు జిల్లా మందమర్రి. చదువుతోంది ఇంటరే అయినా ప్రేమోన్మాదిగా మారాడు. ప్రేమ పేరిట ఓ యువతిని ఆరు నెలలుగా వేధిస్తున్నాడు. అతడి వేధింపులు తాళలేక యువతిని ఆమె కుటుంబ సభ్యులు కరీంనగర్ జిల్లా ధర్మారం మండలం అబ్బాపురంలోని బంధువుల ఇంటికి పంపారు. అయితే తన ప్రేమను తిరస్కరించడమే కాకుండా ఆ యువతి తనకు దూరంగా వెళ్లిందన్న అక్కసుతో కక్ష పెంచుకున్న ఆ యువకుడు అబ్బాపురం వెళ్లాడు. కత్తి చేతబట్టి యువతిపై దాడికి యత్నించాడు. ఈ దాడిని అడ్డుకోబోయిన యువతి తల్లిపై అతడు విచక్షణారహితంగా దాడికి దిగాడు. ఈ దాడిలో యువతి తలకు, ఆమె తల్లి వీపుపై రక్తపు గాయాలయ్యాయి. వెంటనే రంగంలోకి దిగిన యువతి బంధువులు అతడిని పట్టుకుని చెట్టుకు కట్టేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిన్న సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటనలో ప్రేమోన్మాది రామకృష్ణ కటకటాల వెనక్కు వెళ్లాడు.