: ఓయూలో జనజాతర సభకు యత్నం.. భారీగా మోహరించిన పోలీసులు.. ఉద్రిక్తత!
తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్, తార్నాకలోని ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు సమావేశం చేపడుతోన్న నేపథ్యంలో అక్కడ ఏర్పడిన ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. 34 విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జన జాతర సభ నిర్వహణకు విద్యార్థులు సమాయత్తమవుతున్నారు. అయితే పోలీసులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ర్యాలీ, సమావేశాలకు ఓయూలో అనుమతి లేదని చెబుతున్నారు. క్యాంపస్ లో పోలీసులు భారీగా మోహరించారు. ఓయూ గేట్లను మూసివేశారు. దీనిపై విద్యార్థులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు క్యాంపస్‌లో ఆంక్షలు అనైతిక చర్య అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా నిర్వహిస్తోన్న సభకు అనుమతి లేదంటూ ప్రభుత్వం అలజడి సృష్టిస్తోందని విద్యార్థులు అంటున్నారు. అక్కడ ఎటువంటి సంఘ విద్రోహ చర్యలు జరగడం లేదని శాంతి యుతంగా జనజాతర నిర్వహించుకుంటామని చెబుతున్నారు.