: జులై 4న వేలానికి రానున్న సహారా ఆస్తులు!


జులై 4న సహారా గ్రూప్‌ ఆస్తులను వేలం వేయడానికి సిద్ధంగా ఉన్నట్లు హెచ్‌.డీ.ఎఫ్‌.సీ రియాల్టీ ప్రకటించింది. ఆ రోజు ఉదయం 11 గంటల నుంచి 12 వరకూ నిర్వహించనున్న ఆన్‌ లైన్‌ వేలం ద్వారా ప్రస్తుతం 5 ఆస్తులను ఆక్షన్ వేస్తున్నట్లు ప్రకటించిన హెచ్‌.డీ.ఎఫ్‌.సీ రియాల్టీ, వీటి రిజర్వ్ ధరను రూ.722 కోట్లుగా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడులోని సహారా ఆస్తులు వేలంలో ఉన్నట్లు తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం, స్థానిక రెవెన్యూ శాఖ నిర్ధారించిన కనీస ధర కన్నా 90 శాతం తక్కువకు ఈ ఆస్తులను అమ్మడానికి వీలులేదని పేర్కొంది. అలాగే వేలంలో పాల్గొనే ఆసక్తి వున్న వారు జూన్ 10న వేలానికి సంబంధించిన భూములను ప్రత్యేక్షంగా తనిఖీ చేసుకోవచ్చని వెల్లడించింది. ఆస్తుల అమ్మకం విషయంలో సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ)కి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కోర్టు సూచన ప్రకారం దేశవ్యాప్తంగా వున్న సహారా ఆస్తులను ఆన్‌ లైన్‌ ద్వారా వేలం వేసే ప్రక్రియను హెచ్‌.డీ.ఎఫ్‌.సీ రియాల్టీ, ఎస్‌.బీ.ఐ కాపిటల్స్ మార్కెట్స్ చేపట్టాయి. ఇందులో రూ.2,400 కోట్ల విలువైన 31 ఆస్తులను హెచ్‌.డీ.ఎఫ్‌.సీ రియాల్టీ వేలం వేస్తుండగా, మిగిలిన 30 ఆస్తులను రూ.4,100 కోట్ల విలువైన ఆస్తులను ఎస్‌.బీ.ఐ కాపిటల్స్ మార్కెట్స్ వేలం వేయనుంది.

  • Loading...

More Telugu News