: కర్నూలులో కలకలం!... టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించిన మాజీ మంత్రి కేఈ ప్రభాకర్!
టీడీపీలో రాజ్యసభ సీట్ల కేటాయింపు ఆ పార్టీకి చెందిన కర్నూలు జిల్లా శాఖలో ఆగ్రహావేశాలను రగిల్చింది. బీసీ సామాజిక వర్గానికి ఈ దఫా సీటు గ్యారెంటీ అన్న వాదన వినిపించగా, చివరి నిమిషంలో రంగప్రవేశం చేసిన ఆర్యవైశ్య వర్గానికి చెందిన మాజీ మంత్రి టీజీ వెంకటేశ్ సీటు ఎగరేసుకెళ్లారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లాకు చెందిన బీసీ నేత బీటీ నాయుడు నిరాశలో కూరుకుపోయారు. సీటు దక్కకున్నా బీటీ నాయుడు సైటెంట్ గానే ఉన్నప్పటికీ... ఆయన సామాజిక వర్గానికి చెందిన నేతలు మాత్రం భగ్గుమన్నారు. నేటి ఉదయం కర్నూలులోని పార్టీ జిల్లా కార్యాలయాన్ని బీసీ నేతలు ముట్టడించారు. ఈ దండయాత్రకు టీడీపీ సీనియర్ నేతగానే కాకుండా గతంలో చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన కేఈ ప్రభాకర్ నేతృత్వం వహించడం గమనార్హం. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తికి స్వయానా సోదరుడైన ప్రభాకర్ తన సామాజిక వర్గానికి చెందిన నేతకు జరిగిన అన్యాయంపై గళమెత్తి ఏకంగా పార్టీ కార్యాలయం ముట్టడికి తరలివెళ్లడం అక్కడ కలకలం రేపుతోంది. ఈ సందర్భంగా కేఈ ప్రభాకర్... రాజ్యసభ సీట్ల కేటాయింపునకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు చంద్రబాబు మొండి చేయి చూపించారని ఆరోపించారు. పార్టీలు మారిన వారికి, డబ్బు మూటలు ముట్టజెప్పిన వారికి చంద్రబాబు సీట్లిచ్చారని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.