: బీహార్ 'టాపర్ల' నాలెడ్జిపై జోకులు... మళ్లీ పరీక్షకు నితీశ్ కుమార్ ఆదేశం!
బీహార్ లో నిర్వహించిన ఇంటర్ పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన 14 మందికి మరోసారి పరీక్షలు నిర్వహించాలని స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డును నితీశ్ కుమార్ సర్కారు ఆదేశించింది. వాళ్లంతా నిజంగానే తమతమ సబ్జెక్టుల్లో టాపర్లు అయ్యే అర్హతను కలిగివున్నారా? అన్నది తేల్చేందుకు ఈ పరీక్షను నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు. వివిధ సబ్జెక్టుల్లో టాపర్లుగా వచ్చిన వారి వ్యాఖ్యలతో కూడిన ఓ వీడియో సామాజిక మాధ్యమాలు, మీడియాలో హల్ చల్ చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పొలిటికల్ సైన్స్ టాపర్ రూబీకి, తనకు ఎన్ని మార్కులు వచ్చాయో కూడా తెలియదు. 500 మార్కులకు 600 వచ్చినట్టు చెప్పడం, సైన్స్ టాపర్ సౌరవ్ సోడియం, ఎలక్ట్రాన్ అంటే ఏంటో తెలీదని చెప్పడం ఈ వీడియోలో కనిపించింది. ఒకే కళాశాలలో చదివిన వీరికి అత్యధిక మార్కులు రావడంపై విమర్శలు వెల్లువెత్తడంతో పాటు, జోకులు కూడా పేలుతుండడంతో వీరికి మళ్లీ ఓ పరీక్ష, ఇంటర్వ్యూ పెట్టనున్నామని బీఎస్ఈబీ చైర్మన్ లల్కేశ్వర్ ప్రసాద్ సింగ్ వెల్లడించారు. వీరు ఫెయిలైతే, పరీక్షల్లో వాళ్ల పేపర్లు దిద్దిన అధ్యాపకులు, వీరి పరీక్షలకు ఇన్విజిలేటర్లుగా వెళ్లిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.