: అశోక్ గజపతిరాజు 'ఓఎస్డీ'తో ఆయుధ వ్యాపారి సంప్రదింపులు?... కేంద్ర మంత్రి ఓఎస్డీకి 355 కాల్స్ చేసిన భండారీ!
విపక్షం కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ, ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు వివాదాస్పద ఆయుధ వ్యాపారి సంజయ్ భండారీతో లింకులను నిగ్గు తేల్చేందుకు రంగంలోకి దిగిన దర్యాప్తు అధికారులకు షాకిచ్చే విషయాలు వెలుగుచూశాయి. బీజేపీ మిత్రపక్షం టీడీపీకి చెందిన సీనియర్ నేత, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజుతోనూ సంజయ్ భండారీ భేటీ అయ్యారన్న వాస్తవాలు కలకలం రేపుతున్నాయి. సంజయ్ భండారీ నుంచి లండన్ లో ఓ ఇంటిని రాబర్ట్ వాద్రా బహుమానంగా అందుకున్నారన్న విషయాన్ని నిగ్గు తేల్చేందుకు గత నెలలో దర్యాప్తు అధికారులు భండారీ నివాసంలో సోదాలు చేశారు. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా పనిచేస్తున్న అప్పారావుతో భండారీకి లింకులున్నట్లు బయటపడింది. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేయగా... అశోక్ గజపతిరాజుతోనూ భండారీ భేటీ అయినట్లు తేలింది. అశోక్ ను కలిసేందుకు ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసానికి భండారీ నాలుగైదు సార్లు వచ్చారని చెప్పిన అప్పారావు... మంత్రితోనూ భండారీ భేటీ అయ్యారని కూడా అప్పారావు చెప్పారు. గడచిన గడచిన ఏడాది వ్యవధిలోనే అప్పారావుకు భండారీ నుంచి 355 సార్లు ఫోన్ కాల్స్ వచ్చాయన్న విషయాన్ని కొట్టిపారేసిన అప్పారావు... కొన్ని సార్లు మాత్రం తనకు భండారీ ఫోన్ చేశాడని ఒప్పుకున్నారు. విమానయాన పరికరాల వ్యాపారంలో ఉన్న కారణంగానే భండారీతో మంత్రి అశోక్ గజపతిరాజు భేటీ అయ్యారన్నాని ఆయన చెప్పుకొచ్చారు. ఏడాదిన్నర క్రితం బెంగళూరులో జరిగిన ఎయిర్ షో సందర్భంగానూ మంత్రిని భండారీ కలిశారని తెలిపారు. ఈ వివరాలు జాతీయ మీడియాలో కలకలం రేపుతున్నాయి.