: 'చంద్రన్న బీమా' నియమ నిబంధనలు, ప్రయోజనాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేరిట ఏపీలో ప్రారంభమైన 'చంద్రన్న బీమా' పథకం విధివిధానాలకు ఏపీ సర్కారు ఆమోదం తెలిపింది. బీమా పథకం వివరాలను మంత్రి పల్లె రఘునాథరెడ్డి వివరించారు. ప్రమాదంలో మరణించినా, అంగవైకల్యం ఏర్పడినా రూ. 5 లక్షల వరకూ డబ్బు అందుతుందని, ఇది పేదలకు ఒక వరం వంటిదని అన్నారు. అంగవైకల్యానికి రూ. 3,62,500 వరకూ డబ్బు చేతికి అందుతుందని అన్నారు. సహజ మరణం సంభవిస్తే రూ. 30 వేలు, ప్రమాదంలో మరణిస్తే రూ. 5 లక్షలు అందుతాయని వివరించారు. 18 నుంచి 70 సంవత్సరాలున్న వారికి, నెలకు రూ. 15 వేల కన్నా తక్కువగా ఆదాయం పొందుతున్న వారికి ఇది వర్తిస్తుందని ఆయన అన్నారు. అట్టడుగు వర్గాల ప్రజల సంక్షేమం కోసం ఈ పథకాన్ని చంద్రబాబు నాయకత్వంలో రూపొందించినట్టు తెలిపారు. ఏడాదికి రూ. 170 బీమా ప్రీమియంగా చెల్లించాల్సి వుంటుందని, అందులో రూ. 150 ప్రభుత్వమే భరిస్తుందని, లబ్దిదారు నుంచి నామమాత్రపు రుసుమునే వసూలు చేస్తామని పల్లె వివరించారు.