: ఏపీలో ఉద్యోగాల జాతర... పది వేల ఉద్యోగాల భర్తీకి నిర్ణయం: పల్లె రఘునాథ రెడ్డి
ప్రభుత్వోద్యోగాల కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తోన్న నిరుద్యోగులకు త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపికబురు అందించనుంది. ఉద్యోగాల జాతర ఇక మొదలు కానుందని మంత్రి పల్లె రఘునాథ రెడ్డి ఈరోజు విజయవాడలో తెలిపారు. ఏపీ కేబినేట్ సమావేశం అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పదివేల ఉద్యోగాల భర్తీకి మంత్రి వర్గం నిర్ణయం తీసుకుందని చెప్పారు. పోలీస్ మినహా అన్ని ఉద్యోగాలు ఏపీపీఎస్సీ ద్వారానే భర్తీ చేయనున్నామని పేర్కొన్నారు. త్వరలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. గ్రూప్ 1లో 94, గ్రూప్ 2లో 750, గ్రూప్ 3లో వెయ్యి పోస్టులు భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే పోలీస్ శాఖలో 6వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు చెప్పారు.