: జాట్ల విధ్వంసానికి కారణం పోలీసులే: కేంద్రానికి అందిన నివేదిక
ఈ సంవత్సరం ఫిబ్రవరిలో హర్యానాలో జరిగిన జాట్ వర్గీయుల విధ్వంసకాండకు పోలీసుల వైఖరే కారణమని ప్రకాష్ సింగ్ కమిటీ తన రిపోర్టును కేంద్రానికి అందించింది. ఫిబ్రవరి 17వ తేదీన రోహ్ తక్ లోని ఇద్దరు హాస్టల్ విద్యార్థులను తీవ్రంగా హింసించారని, ఈ కారణంగానే హింస ప్రజ్వరిల్లిందని, పరిస్థితిని ముందుగా అంచనా వేయలేకపోయారని నివేదిక వెల్లడించింది. దాదాపు వారం రోజుల పాటు ఆందోళనలు, విధ్వంసం కొనసాగగా, 30 మంది వరకూ చనిపోయిన సంగతి తెలిసిందే. నాడు జరిగిన మూడు ఘటనలను కమిటీ ప్రధానంగా ప్రస్తావించింది. జాట్ న్యాయవాదులు, రిజర్వేషన్ వ్యతిరేక వర్గాలకూ మధ్య జరిగిన పోరాటాన్ని, వాళ్లు రాళ్లు రువ్వుకోవడాన్ని గుర్తు చేస్తూ, ఆపై జాట్లకు చెందిన వారు 250 మంది యువనేత సుదీప్ కల్కాల్ నేతృత్వంలో విధ్వంసానికి దిగారని తెలిపింది. పోలీసులు వెంటనే స్పందించి వుంటే నష్టం అధికంగా ఉండేది కాదని తేల్చింది.