: రాజ్యసభ పోరులో పోలింగ్ లేదు!... రెండు రాష్ట్రాల్లోని ఆరు సీట్లూ ఏకగ్రీవం!


రాజ్యసభలో ఖాళీ కానున్న స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ లేకుండానే క్రతువు ముగిసింది. దేశవ్యాప్తంగా మొత్తం 57 స్థానాలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయగా, వాటిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆరు సీట్లున్నాయి. ఏపీలో నాలుగు సీట్లు ఉండగా... ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఆధారంగా అధికార టీడీపీకి మూడు, విపక్ష వైసీపీకి ఒక సీటు దక్కాయి. వైసీపీ అభ్యర్థిగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ అభ్యర్థులుగా కేంద్ర మంత్రి సుజనా చౌదరి, మాజీ మంత్రి టీజీ వెంకటేశ్ నామినేషన్ వేశారు. ఇక మిత్రపక్షం బీజేపీకి టీడీపీ ఆఫర్ చేసిన ఒక సీటుకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు బరిలోకి దిగారు. నాలుగో సీటుకు అభ్యర్థిని బరిలోకి దించాలని టీడీపీ యత్నించినా... చివరి నిమిషంలో మనసు మార్చుకుని పోటీ చేయరాదని నిర్ణయించింది. దీంతో మొత్తం నాలుగు సీట్లకు ఒక్కొక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో పోలింగ్ లేకుండానే ఆయా అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలిచిపోయారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే... ఉన్న రెండు సీట్లను కూడా అధికార పార్టీ టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. పార్టీ అభ్యర్ధులుగా సీనియర్ రాజకీయ వేత్తలు ధర్మపురి శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతారావులు నామినేషన్లు దాఖలు చేశారు. విపక్ష టీ కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగాలని త్వరలోనే మాజీ ఎంపీగా మారనున్న వి.హన్మంతరావు ఉవ్విళ్లూరినా పార్టీ అధిష్ఠానం అంగీకరించలేదు. దీంతో ఈ రెండింటికి కూడా సింగిల్ నామినేషనే దాఖలైంది. వెరసి ఈ రెండు సీట్లకు నామినేషన్లు దాఖలు చేసిన డీఎస్, లక్ష్మీకాంతారావులు ఏకగ్రీవంగానే రాజ్యసభకు ఎన్నికైనట్టైంది.

  • Loading...

More Telugu News