: పొగాకు తెచ్చిపెట్టే ముప్పుపై చిన్నారులకు సందేశాలు
పొగాకు కారణంగా భారత్‌తో పాటు సౌత్ ఈస్ట్ ఏసియా ప్రాంతంలో ప్రతీ గంటకు 150 మంది ప్రజలు పొగాకు కలిగించే వ్యాధులతో చనిపోతున్నారని డబ్యూహెచ్‌వో ఈరోజు హెచ్చరించిన సంగతి తెలిసిందే. పొగాకు తెచ్చిపెట్టే అనారోగ్య సమస్యలపై చిన్ననాటి నుంచి పౌరుల్లో అవగాహన కల్పిస్తే మంచి ప్రయోజనం ఉంటుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ భావిస్తోంది. ఈ అంశంపై కేంద్ర మానవ వనరుల శాఖతో ఆరోగ్య శాఖ చర్చించింది. పొగాకుకి బానిసలుగా మారకుండా అది తెచ్చిపెట్టే ముప్పును వివరిస్తూ పాఠశాలల్లో సందేశాలు అందించాలని నిర్ణయించింది. అయితే పాఠ్య పుస్తకాల పాఠాల్లో భాగంగా కాకుండా, వాటి ముఖ చిత్రాల రూపంలో లేదా ప్రత్యేక పోస్టర్ల ద్వారా పిల్లలకు సందేశాలు అందించాలని చూస్తోంది. వీటి వల్ల పిల్లలు పెరిగి యవ్వన దశలోకి వచ్చేలోపే పొగాకు వాడకంతో వచ్చే అనారోగ్యం పట్ల అవగాహన తెచ్చుకుంటారని, వాటి వాడకానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటారని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అభిప్రాయపడ్డారు.