: ఎల్లుండి కేసీఆర్ ఎంత బిజీ అంటే..!
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ షెడ్యూల్ ఖరారైంది. ఎల్లుండి ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొని రోజంతా బిజీగా గడపనున్నారు. ఉదయం 9:30 గంటలకు ప్రారంభమయ్యే ఆయన డే షెడ్యూల్ లో భాగంగా, తొలుత అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పిస్తారు. ఆపై 9:45 గంటలకు లుంబినీ పార్కులో అమరవీరుల మెమోరియల్ కు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం 10:10కి సంజీవయ్య పార్కులో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. 10:30 గంటల నుంచి సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగే తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొంటారు. సుమారు గంటన్నర పాటు అక్కడే ఉండే కేసీఆర్, ఆపై 12 గంటలకు విశిష్ట సమావేశాన్ని నిర్వహించనున్నారు. కేసీఆర్ అధ్యక్షతన జరిగే సమావేశానికి తెలుగురాష్ట్రాల గవర్నర్ నరసింహన్ సైతం హాజరు కానున్నారు. ఆపై సాయంత్రం జరిగే ఆవిర్భావ ఉత్సవాల్లో సైతం ఆయన భాగం పంచుకోనున్నారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలియజేసింది.