: బాబుగారూ!... నాలుగో అభ్యర్థితో ఇబ్బందే!: చంద్రబాబుకు వెంకయ్య సూచన
రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి విపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చిక్కుల్లోకి నెట్టే వ్యూహం వల్ల మొదటికే మోసం చేస్తుందట. ఏపీ కోటాలోని నాలుగు సీట్లలో మూడు సీట్లు ఏకగ్రీవంగానే టీడీపీకి దక్కనున్నాయి. అయితే వైసీపీకి దక్కనున్న సింగిల్ సీటును కూడా చేజిక్కించుకుని విపక్షానికి షాకివ్వాలని అధికార పార్టీ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ దిశగా నిన్న చర్చలు జరిపిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు... ఇటీవలే వైసీపీ నుంచి తమ పార్టీలోకి చేరిన 17 మంది ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. 'నాలుగో అభ్యర్థిని బరిలోకి దింపాలా? వద్దా? అన్న విషయం మీరే తేల్చండి' అంటూ ఆయన ‘జంపింగ్’ ఎమ్మెల్యేలపైనే భారం మోపారు. ఈ క్రమంలో నిన్న రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామినేషన్ వేసిన తర్వాత బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు... చంద్రబాబుతో మాట్లాడారు. ‘‘మూడు సీట్లకు పోటీ చేస్తే ఏకగ్రీవంగా ఆ స్థానాలను దక్కించుకోవచ్చు. ఇక నాలుగో సీటు కూడా కావాలంటూ పోటీకి దిగితే... మిగిలిన మూడు సీట్లకు కూడా ఎన్నికలు జరగక తప్పదు. ఇది మొదటికే మోసంతేక మానదు’’ అని చంద్రబాబుకు వెంకయ్య చెప్పారట.