: నోబాల్ ఇచ్చిన అంపైర్ సోదరికి విషం పెట్టి చంపిన క్రికెటర్


క్రికెట్ లో 'నోబాల్' ఇచ్చాడన్న కోపంతో ఓ అంపైర్ చెల్లికి విషం పెట్టిన ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, అలీగఢ్ కు సమీపంలో ఉన్న జరారా అనే చిన్న పట్టణమది. ఐపీఎల్ పోటీలను స్ఫూర్తిగా తీసుకున్న ఇక్కడి క్రీడా అభిమానులు జేపీఎల్ (జరారా ప్రీమియర్ లీగ్) నిర్వహించుకుంటారు. ఈ నెల 14న మొదలైన జేపీఎల్ లో గెలిచిన టీముకు రూ. 5,100 నగదు బహుమతి ఇస్తామని కూడా నిర్వాహకులు ప్రకటించారు. 28 వరకూ అంతా సక్రమంగానే సాగింది. పోటీలకు అంపైర్ గా వ్యవహరించిన రాజ్ కుమార్, జరారా, బారికీ టీముల మధ్య జరిగిన పోటీ తీవ్ర ఉత్కంఠ మధ్య సాగుతుండగా, ఓ బంతిని 'నోబాల్' గా చెప్పడం వివాదానికి కారణమైంది. బ్యాటింగ్ చేస్తున్న సందీప్ పాల్, నోబాల్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేయగా, రాజ్ కుమార్ అందుకు నిరాకరించాడు. తప్పు చేస్తున్నావని, దీనికి శిక్షణ నీ ఇంట్లో ఒకరిని కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. అయినా రాజ్ కుమార్ స్పందించలేదు. ఆ మరుసటి రోజు, అంటే 29న కుమార్ చెల్లెలు పూజ (15) తన స్నేహితురాళ్లతో కలసి వస్తుంటే, సందీప్ ఆపాడు. ముగ్గురికీ విషం కలిపిన కూల్ డ్రింక్స్ ఆఫర్ చేశాడు. సందీప్ అందరికీ, తెలిసి వుండటంతో ఏ మాత్రం అనుమానం రాకుండా వారంతా డ్రింక్స్ తాగారు. ఆపై నలుగురూ అపస్మారక స్థితిలోకి వెళ్లగా వారిని ఆసుపత్రిలో చేర్చారు. విషం మోతాదు అధికంగా ఉండటంతో పూజ మరణించింది. మిగతా ముగ్గురి పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉన్నట్టు గ్రామ పెద్ద రతన్ లాల్ రావల్ తెలిపారు. "ఈ క్రికెట్ పోటీలు వద్దని నేను ముందునుంచే చెబుతున్నాను. నా భయం నిజమైంది. ఇక్కడి వారెవరకీ క్రీడాస్ఫూర్తి ఉండదు. పగలు, కొట్టుకోవడాలు తప్ప" అని అన్నారు. కేసు నమోదు చేసిన దర్యాఫ్తు చేస్తున్నామని ఖాయిర్ స్టేషన్ ఆఫీసర్ సుఖ్ దేవ్ యాదవ్ వెల్లడించారు. నిందితుడు పరారీలో ఉన్నాడని తెలిపారు.

  • Loading...

More Telugu News