: కర్నూలు జిల్లాకు తొలిసారి రాజ్యసభ సీటు ఇచ్చాం: లోకేష్
కర్నూలు జిల్లాకు తొలిసారి రాజ్యసభ సీటు ఇచ్చామని, టీడీపీ మంచి విధానాలను అనుసరిస్తోందని ఆ పార్టీ యువనేత నారా లోకేష్ అన్నారు. టీజీ వెంకటేష్ ను రాయలసీమ నుంచి రాజ్యసభకు పంపించనుండడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాజ్యసభ అభ్యర్థులుగా టీడీపీ-బీజేపీ నేతలు హైదరాబాద్ లో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ నుంచి కేంద్రమంత్రి సురేష్ ప్రభుని తాము రాజ్యసభ అభ్యర్థిగా నిలబెట్టడం ఏపీ ప్రజలు సంతోషించదగ్గ విషయమని లోకేష్ పేర్కొన్నారు. టీడీపీ- బీజేపీ కలిసికట్టుగా పనిచేస్తున్నాయని ఆయన అన్నారు. తమ మరో అభ్యర్థి సుజనా చౌదరి టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ అభివృద్ధితో పాటు రాష్ట్రాభివృద్ధి కోసం ఎంతో కష్టపడ్డారని లోకేష్ ప్రశంసించారు. అటువంటి వ్యక్తికి రాజ్యసభ సీటు ఇవ్వడం ఆనందంగా ఉందని అన్నారు.