: మోదీ సొంతూళ్లో చెలరేగిన హింస!... పోలీసులపై విరుచుకుపడిన స్థానికులు!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంతూరు గుజరాత్ లోని వడోదరలో కొద్దిసేపటి క్రితం భారీ హింస చెలరేగింది. నగరంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు వచ్చిన అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రంగప్రవేశం చేసిన పోలీసులు కాస్తంత దూకుడు ప్రదర్శించారు. అంతే... భగ్గుమన్న స్థానికులు రెచ్చిపోయారు. పోలీసులపై విరుచుకుపడ్డారు. సమీపంలోని పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు. పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు. ఒక్కసారిగా ఊహించని రీతిలో స్థానికుల నుంచి తిరుగుబాటు ఎదురవడంతో పోలీసులు షాక్ తిన్నారు. వారు తేరుకునేలోగానే నష్టం జరిగిపోయింది. ఈ హింసలో ప్రభుత్వ ఆస్తులకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లగా, పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. కాస్తంత ఆలస్యంగా అక్కడికి చేరుకున్న అదనపు పోలీసు బలగాలు పరిస్థితిని చక్కదిద్దే యత్నం చేస్తున్నాయి. ఓ వైపు ఆగ్రహంతో ఊగిపోతున్న స్థానికులు, మరోవైపు లాఠీలు పట్టిన పోలీసులతో అక్కడ ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది.