: భాగ్యనగరి సిగలో మరో కలికితురాయి... నక్లెస్ రోడ్డులో ఇండియాలోనే ఎత్తయిన పతాకం!


తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా దేశంలోనే అతిపెద్ద మువ్వన్నెల పతాకం హైదరాబాద్ నడిబొడ్డున నిలువనుంది. నక్లెస్ రోడ్డులోని సంజీవయ్య పార్కులో 303 అడుగుల పొడవున (92.35 మీటర్లు) ఉండే పోల్ కు 92 కిలోల బరువుండే పాలిస్టర్ తో తయారైన జాతీయ పతాకం వేలాడుతూ ఉంటుంది. ఇది 108 అడుగుల వెడల్పు, 72 అడుగుల పొడవును కలిగివుంటుందని, దీన్ని ముంబై నుంచి తెప్పించామని అధికారులు తెలిపారు. ఒకవేళ పతాకం దెబ్బతింటే, వెంటనే రీప్లేస్ చేయడానికి మరో నాలుగు జెండాలను సిద్ధంగా ఉంచామని తెలంగాణ చీఫ్ ఇంజనీర్ గణపతి రెడ్డి వివరించారు. జెండా నిర్మాణ పనులను కోల్ కతాకు చెందిన స్కిప్పర్ సంస్థకు అప్పగించామని, మొత్తం ప్రాజెక్టుకు రూ. 1.8 కోట్లు ఖర్చయిందని తెలిపారు. మొత్తం 50 టన్నుల బరువుంటుందని వివరించారు. కాగా, ఇంత ఎత్తైన జెండాకు ఎయిర్ పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఇంకా అనుమతి లభించలేదు. ఏఏఐ అనుమతి లభించి, ఈ జెండా ఆవిష్కరణ జరిగితే, ప్రస్తుతం దేశంలో అత్యంత ఎత్తయిన జెండాగా ఉన్న రాయిపూర్ (91 మీటర్లు) రికార్డు బద్దలవుతుంది.

  • Loading...

More Telugu News