: ‘సాక్షి’ పత్రికపైన, నలుగురు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపైన ఆ పార్టీ నేత ఆరోపణలు
‘సాక్షి’ దినపత్రిక, వైఎస్సార్సీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలపై గుంటూరు జిల్లా నంబూరుకు చెందిన ఆ పార్టీ నేత మందాల సంజీవరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. రూ.2 కోట్లు ఇవ్వాలని తనను బ్లాక్ మెయిల్ చేస్తూ ‘సాక్షి’లో కథనాలు రాస్తున్నారని ఆరోపించారు. అమరావతిలోని సదావర్తివారి సత్రం భూములను వేలంలో రూ.25 కోట్లకు తాను దక్కించుకున్నానని, అప్పటి నుంచి తనను రెండు కోట్లు డిమాండ్ చేయడం మొదలుపెట్టారని ఆరోపించారు. అందుకు తాను అంగీకరించకపోవడంతో, తనకు, టీడీపీ నేతలకు సంబంధాలు ఉన్నట్లు ‘సాక్షి’ పత్రికలో కథనాలు రాశారని వాపోయారు. ‘వారం పదిరోజుల నుంచి ఫోన్ చేస్తూ, రెండు కోట్లు, మూడు కోట్లు కావాలని అడుగుతున్నారు. సదావర్తి వారి సత్రం భూముల విషయంలో సీఎం చంద్రబాబు నాయుడుగారికి, కుమారుడు లోకేశ్ కు, టీడీపీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ కు గానీ ఎటువంటి సంబంధం లేదు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు నలుగురు, ఈ మీడియా వాళ్లు ఇద్దరు హైలెవెల్ లో నన్ను టార్గెట్ చేసి రెండు కోట్లు కావాలి, మూడు కోట్లు కావాలని బెదిరించారు’ అని సంజీవరెడ్డి ఆరోపించారు.