: హార్మోన్ల తేడా... బాలుడిలో పాతికేళ్ల యువకుడి లక్షణాలు!
ఏడాది వయసున్న బాలుడిలో 25 ఏళ్ల యువకుడి లక్షణాలు కనిపిస్తే? ఆ తల్లిదండ్రుల ఆందోళనను లెక్కించలేము. అలాంటి ఘటనే ఢిల్లీలో చోటుచేసుకుంది. ఏడాది వయసున్న బాలుడిలో సహజంగా ఉండాల్సిన ఎత్తు కంటే 15 సెంటీమీటర్ల అదనపు ఎత్తు, గడ్డం, మీసాలు ఇతర చోట్ల అవాంఛిత రోమాలు రావడాన్ని బాలుడి తల్లిదండ్రులు గుర్తించారు. దీంతో వైద్యులను వారు సంప్రదించగా, హార్మోన్ల అసమతౌల్యత వల్ల ఇది సంభవించిందని వారు చెప్పారు. టెస్టోస్టెరాన్ హార్మోన్ 25 ఏళ్ల వయసున్న వ్యక్తిలో విడుదల కావాల్సిన స్థాయిలో ఏడాది బాలుడిలో విడుదల కావడాన్ని గుర్తించి వారు ఆశ్చర్యానికి గురయ్యారు. దీంతో లక్ష మందిలో సంభవించే హార్మోన్ల అసమతౌల్యత బాలుడిలో ఉందని వారు తెలిపారు. ఆందోళన చెందాల్సిన పని లేదని, నెలకి ఒక ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా హార్మోన్ల స్థాయులను సమానంగా ఉంచవచ్చని తెలిపి ధైర్యం చెప్పారు.