: టెక్నాలజీ అభివృద్ధిలో భారతీయులది కీలక పాత్ర: మోదీతో సత్య నాదెళ్ల
మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల ఈరోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సత్య నాదెళ్ల మాట్లాడుతూ భారత్‌లోని టెక్నాలజీ డెవలపర్స్, వ్యవస్థాపకులు నూతన ఆవిష్కరణల్లో దేశంలో, విదేశాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారని అన్నారు. తమ కంపెనీ వారికి ఓ వేదికగా ఉండాలని కోరుకుంటోందని ఆయన పేర్కొన్నారు. ప్రతీ వ్యక్తి తమ కంపెనీ ద్వారా మరింత అభివృద్ధిని సాధించాలని తాము కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. భారత్‌లో తన ఒక్కరోజు పర్యటనలో భాగంగా మైక్రోసాఫ్ట్ కంపెనీ ఢిల్లీలో నిర్వహించిన విద్యార్థులు, యువపారిశ్రామిక వేత్తలతో భేటీ కార్యక్రమంలో సత్య నాదెళ్ల పాల్గొన్నారు. అనంతరం మోదీతో భేటీ అయి భారత్‌లో ఐటీ రంగం, డిజిటల్ ఇండియాపై చర్చించారు. ‘మైక్రోసాఫ్ట్ సీఈవోతో ఐటీ రంగానికి సంబంధించిన విషయాలు చర్చించా’నని మోదీ ఈ సందర్భంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు.