: తదుపరి అమెరికా అధ్యక్షుడు మోదీ దారిలో నడవాల్సిందే: సిస్కో అధ్యక్షుడు జాన్ చాంబర్స్


అమెరికా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికైనా, దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ చూపిన బాటలో నడవాల్సిందేనని టెక్నాలజీ దిగ్గజం సిస్కో చైర్మన్ జాన్ చాంబర్స్ వ్యాఖ్యానించారు. ఇండియాలో ఉత్పత్తి రంగాన్ని, ఉపాధినీ మరింతగా పెంచేలా చేపట్టిన 'మేకిన్ ఇండియా', 'స్టార్టప్ ఇండియా' కార్యక్రమాలను ప్రస్తావిస్తూ, యూఎస్ ప్రెసిడెంట్ వాటిని ఆదర్శంగా తీసుకుని భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలను రూపొందించుకోవాల్సి వుంటుందని అన్నారు. ప్రస్తుతం అమెరికాలో పరిస్థితిని చూస్తుంటే, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తదుపరి అధ్యక్షుడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఏ రాజకీయ పార్టీ అభ్యర్థి అధికారంలోకి వచ్చినా, మోదీ ఇండియాలో చేస్తున్నట్టుగా సాంకేతికత, ఉద్యోగ సృష్టిపై దృష్టిని సారించాల్సి వుందని అన్నారు. "నా అభిప్రాయం ప్రకారం, ముఖ్యమైన విషయం ఏంటంటే, తదుపరి అధ్యక్షుడయ్యే వ్యక్తి, జూన్ తొలివారంలో ఇక్కడికి వచ్చే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏం చేస్తారో దాన్ని అనుసరించాలి" అని బ్లూమ్ బర్గ్ బ్రేక్ అవే సదస్సులో ప్రసంగించిన చాంబర్స్ సలహా ఇచ్చారు. "వచ్చే నెల 7, 8 తేదీల్లో అమెరికాలో పర్యటించే ఆయన డిజిటల్ ఇండియా గురించి మాట్లాడతారు. ఇండియాలో డిజిటల్ మాధ్యమం ప్రపంచంలోనే శరవేగంగా విస్తరిస్తోంది. అమెరికా కాంగ్రెస్ ను ఉద్దేశించి కూడా ఆయన ప్రసంగించనున్నారు" అని చాంబర్స్ గుర్తు చేశారు. ఇండియాలో డిజిటల్ మాన్యుఫాక్చరింగ్ కు పెద్దపీట వేయడం ద్వారా నెలకు పది లక్షల వరకూ కొత్త ఉద్యోగాల సృష్టి జరగనుందని ఆయన అన్నారు. ఇండియాలో ప్రతి పౌరుడికీ చౌక ధరలో వేగవంతమైన బ్రాడ్ బ్యాండ్ సేవలందించేందుకు మోదీ దృష్టిని సారించారని, దీంతో వైద్యం, విద్యా రంగాల్లో పెను మార్పులు సంభవిస్తాయని అంచనా వేశారు.

  • Loading...

More Telugu News