: టీ కాంగ్రెస్ కు ఝలక్!... గులాబీ గూటికి చేరనున్న కోమటిరెడ్డి బ్రదర్స్!
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించిన కాంగ్రెస్ పార్టీకి ఆ రాష్ట్ర ప్రజలు అంతగా మద్దతు పలకలేదు. గడచిన ఎన్నికల్లో ఎదురు దెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీకి తాజాగా పెను షాక్ తగలనుంది. నల్లగొండ జిల్లాలోనే కాక మరికొన్ని ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం చూపగలిగే సత్తా ఉన్న ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తన సోదరుడు, మాజీ ఎంపీ రాజగోపాల్ రెడ్డితో కలిసి టీఆర్ఎస్ లో చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే తమ అనుచరులతో చర్చలు జరిపిన కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్ కు ‘చేయి’చ్చేందుకే నిర్ణయించుకున్నట్లు సమాచారం. వచ్చే నెల మొదటి వారంలో కోమటిరెడ్డి బ్రదర్స్ తమ అనుచరులతో కలిసి గులాబీ కండువా కప్పుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని తెలుస్తోంది. కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు కాస్తంత దూరంగా ఉంటున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి టీఆర్ఎస్ లో చేరడం ఖాయమని ఆయన అనుచరులు చర్చించుకుంటున్నారు. ఇదే జరిగితే తెలంగాణలో కాంగ్రెస్ మరింత బలహీనపడినట్టేనన్న విశ్లేషణలు కొనసాగుతున్నాయి.