: మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవం: లావణ్య మృతి కేసులో పోలీసులు
విశాఖపట్నంలో కొన్ని రోజుల క్రితం వడ్లపూడికి చెందిన లావణ్య అనే మహిళ ఆమె భర్త, ఆడపడుచుతో కలిసి ద్విచక్ర వాహనంపై అనకాపల్లి నూకాలమ్మ ఆలయానికి వెళుతుండగా కారు ఢీ కొని చనిపోయిన సంగతి తెలిసిందే. ప్రమాదంపై కుటుంబ సభ్యులు పలు ఆరోపణలు చేస్తూ, ఆందోళన వ్యక్తం చేశారు. అయితే హిట్ అండ్ రన్ కేసుపై పోలీసు కమిషనర్ యోగానంద్ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ప్రమాదంపై అసలు విషయాన్ని వెల్లడించారు. అనకాపల్లికి చెందిన హేమకుమార్, అతని స్నేహితులు లావణ్య దంపతులను ఉదయం నుంచి వేధించారని వారికి హాని తలపెట్టాలనే కారుతో ఢీ కొట్టారని మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు. తాగిన మైకంలో హేమకుమార్ తన కారుతో లావణ్య ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టాడని సీపీ మీడియాకు తెలిపారు. హేమకుమార్ తాగిన మైకంలో ఉండడం దానికి తోడు ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడమే ప్రమాదానికి కారణమయిందని చెప్పారు. కేసుకి సంబంధించి నిందితులను అరెస్టు చేశామని పేర్కొన్నారు.