: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం.. 15 ఏళ్ల బాలికపై అత్యాచారం.. చంపేసి చెట్టుకు వేలాడదీసిన వైనం
ఉత్తరప్రదేశ్, బహ్రాయిచ్‌లోని నంపారాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 15ఏళ్ల ఓ బాలికపై పలువురు దుండగులు అత్యాచారం చేసి హత్య చేశారు. ఆ తరువాత బాలిక మృతదేహాన్ని ఊరి చివరనున్న చెట్టుకు వేలాడదీశారు. గత శుక్రవారం అదృశ్యమైన బాలిక అక్కడి ఓ చెట్టుపై వేలాడుతూ కనపడడం స్థానికంగా తీవ్ర కలకలం రేగుతోంది. తమ గ్రామానికే చెందిన ముగ్గురు వ్యక్తులు తమ కూతురిని కిడ్నాప్ చేశారని బాలిక తల్లిదండ్రులు చెబుతున్నారు. ఘటనకు సంబంధించి పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. ఆమెకు పరిచయమున్న ఓ వ్యక్తి తనతో మాట్లాడాలని బాలికను పిలిచి, మరో ఇద్దరితో కలిసి అత్యాచారం చేసి, చంపేశాడని పోలీసులు తెలిపారు. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించడానికి బాలిక మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీశారని పేర్కొన్నారు.