: పలావ్, ఆవకాయ అదుర్స్!... ఓ పట్టు పట్టిన టీడీపీ శ్రేణులు!


టీడీపీ వార్షిక వేడుకకు తెలుగు రాష్ట్రాల నుంచి తిరుపతికి తరలివచ్చిన ఆ పార్టీ నేతలకు నోరూరించే భోజనం సిద్ధమంటూ తెలుగు మీడియాతో పాటు నేషనల్ మీడియా కూడా పెద్ద సంఖ్యలో వార్తా కథనాలను వండి వార్చాయి. మూడు రోజుల పాటు ఏకబిగిన సాగిన మహానాడు వేడుకలు నిన్న సాయంత్రంతో ముగిశాయి. ఈ నేపథ్యంలో పార్టీ నేతల భోజనాలకు ఏఏ పదార్ధాలను వడ్డించారు, ఎంత మేర ఖర్చయ్యాయన్న వివరాలను ఆ పార్టీ వెల్లడించింది. అవకాయను 2,500 కిలోల మేర తయారు చేయగా... అదంతా తొలి రోజే ఖాళీ అయిపోయింది. ఇక 500 కిలోల గోంగూర పచ్చడి కూడా మొదటి రోజునే ఆవిరై పోయింది. మూడు రోజులకు సరిపోతాయిలే అనుకుని తయారుచేసిన లడ్డూలు, కాజాలు కూడా రుచిగా ఉండటంతో తొలి రోజే అయిపోయాయి. ఇక మూడు రోజుల వేడుకల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు 150 కిలోల బాస్మతీ రైస్ తో చేసిన పలావ్ ను లాగించేశారు. మూడు రోజుల మహానాడులో మొత్తంగా 1.5 లక్షల ప్లేట్లు లేచాయి. 100 క్వింటాళ్ల బియ్యం, 50 బస్తాల కందిపప్పు, 50 బస్తాల ఉద్దిపప్పు, 300 డబ్బాల నూనె, 40 డబ్బాల నెయ్యి వినియోగమయ్యాయి. వంటకాల తయారీ కోసం 250 గ్యాస్ సిలిండర్లు, 13 టన్నుల వంట చెరకు ఖర్చైంది.

  • Loading...

More Telugu News