: టెన్షన్ లో సుజనా!... రాజ్యసభ బెర్త్ ను ఖరారు చేయని చంద్రబాబు!
టీడీపీ సీనియర్ నేత, కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరిలో టెన్షన్ గంట గంటకూ పెరుగుతోంది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన పదవీ కాలం వచ్చే నెల చివరకు ముగియనుంది. సుజనాతో పాటు 50 మందికిపైగా రాజ్యసభ సభ్యుల పదవీ కాలం కూడా ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ సీట్లకు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలకు సంబందించి రేపటితో నామినేషన్ల గడువు ముగియనుంది. ఎన్నికలు జరగనున్న సీట్లలో ఏపీ కోటాలో నాలుగు సీట్లున్నాయి. వీటిలో మూడు సీట్లు టీడీపీకి, ఓ సీటు వైసీపీకి దక్కనున్నాయి. కేంద్ర మంత్రిగా ఉన్న సుజనాకు ఓ సీటు ఇచ్చేందుకు టీడీపీ ఇప్పటికే నిర్ణయించిందని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి పార్టీ అధినేత చంద్రబాబునాయుడి నుంచి సుజనాకు ఎలాంటి సమాచారం లేదు. ఒకవేళ పార్టీ టికెట్ దక్కకపోతే రాజ్యసభ సభ్యత్వంతో పాటు కేంద్ర మంత్రి పదవిని కూడా సుజనా కోల్పోక తప్పని పరిస్థితి. అయితే ఇటీవలే ఆయనపై వెల్లువెత్తిన విమర్శల నేపథ్యంలో సుజనాకు రెండో టెర్మ్ రాజ్యసభ సభ్యత్వం ఇచ్చే విషయంలో చంద్రబాబు విముఖత చూపుతున్నారని ఇటీవల కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో నామినేషన్ల గడువు ముగుస్తున్నా... పార్టీ అధినేత నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో సుజనాలో గంట గంటకూ టెన్షన్ పెరుగుతోందట. నేటి సాయంత్రం దాకా ఆయన టెన్షన్ తగ్గే పరిస్థితి లేదన్న వార్తలూ వినిపిస్తున్నాయి.