: వైఎస్ జగన్ కు డబుల్ ఝలక్!... బెజవాడకు ‘జంపింగ్’లతో కలిసి మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నేడు ‘డబుల్ ఝలక్’ తప్పేలా లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. రాజ్యసభ బరిలో వైసీపీకి దక్కనున్న సింగిల్ సీటుకు గండికొట్టాలని టీడీపీ వ్యూహాలు రచిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైసీపీ నుంచి ఇటీవలే టీడీపీలోకి చేరిన 17 మంది ఎమ్మెల్యేలను టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు విజయవాడకు రావాలని ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు ఆదేశాలతో నిన్న రాత్రే కొందరు విజయవాడ బయలుదేరారు. ఇక విజయవాడకు సమీపంలోని జిల్లాలకు చెందిన ‘జంపింగ్’ ఎమ్మెల్యేలు నేటి ఉదయం అక్కడకు పయనమయ్యారు. ఈ క్రమంలో ‘జంపింగ్’ ఎమ్మెల్యేలతో పాటు మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు విజయవాడకు వస్తున్నట్లు సమాచారం. ‘జంపింగ్’ ఎమ్మెల్యేలతో పాటే వారు సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబుతో భేటీ కానున్నట్లు సమాచారం. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరన్న విషయం బయటకు రానప్పటికీ... ఈ వార్త వైసీపీలో వణుకు పుట్టిస్తోంది.