: పాక్ బౌలర్ అమీర్ కు వీసా కోసం పీసీబీ తిప్పలు
సుమారు ఆరేళ్ల క్రితం ఇంగ్లాండుకు వెళ్లిన పాక్ జట్టు సభ్యుల్లో మహ్మద్ అమీర్, ఆసిఫ్, సల్మాన్ భట్ స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడినట్లు తేలడంతో వారిపై ఐసీసీ నాడు నిషేధం విధించడం, అక్కడే అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. ఆ దేశం జైలులో గడపడం అమీర్ కు ఇప్పుడు పెద్ద తలకాయ నొప్పిగా మారింది. ఎందుకంటే, ఆ దేశంలో ఏడాది నుంచి నాలుగేళ్ల పాటు ఎవరైనా జైలు జీవితం కనుక గడిపితే ఆ దేశ నిబంధనల ప్రకారం పదేళ్ల పాటు వీసా ఇవ్వరు. ఇప్పుడు ఈ నిబంధనే అమీర్ కు తలకాయ నొప్పిగా మారింది. ఎందుకంటే, పాకిస్థాన్ జట్టు ఈ జూన్ చివర్లో ఇంగ్లాడ్ లో పర్యటించనుంది. దీంతో అమీర్ కు వీసా తెప్పించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నానా తంటాలు పడుతోంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండు క్రికెట్ బోర్డుతో, ఇస్లామాబాద్ లోని బ్రిటన్ హైకమిషనర్ తో సంప్రదింపులు జరపనున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డులోని ఒక ఉన్నతాధికారి పేర్కొన్నారు.