: టీటీడీ బోర్డులో తెలంగాణ టీడీపీ నేత... అరికెలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న చంద్రబాబు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యుడిగా నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే, తెలంగాణలో తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న కొద్ది మంది నేతల్లో ఒకరైన అరికెల నర్సారెడ్డిని నియమించారు. అరికెల నియామకాన్ని ఖరారు చేస్తూ రాష్ట్ర దేవాదాయశాఖ చీఫ్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, గతంలో తనకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం ఇవ్వకుండా వేం నరేందర్ రెడ్డికి అవకాశం ఇచ్చారని ఆరోపిస్తూ, ఆయన అలకబూనిన సంగతి తెలిసిందే. నేతలందరూ పార్టీని వీడినా తాను టీఆర్ఎస్ పై ఒంటరి పోరాటం చేస్తున్నానని అరికెల వాపోయారు కూడా. తన పోరాటాన్ని గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తుంటే, స్పందించిన చంద్రబాబు, టీటీడీ ట్రస్ట్ సభ్యుడి పదవిని ఇస్తానని హామీ ఇచ్చినట్టు గతంలోనే వార్తలు వచ్చాయి. తాజా ఉత్తర్వులతో అరికెలకు ఇచ్చిన హామీని చంద్రబాబు నిలబెట్టుకున్నట్లయింది.