: భక్తగిరులైన తిరుమల గిరులు!... రికార్డు స్థాయిలో నడక మార్గాన 42 వేల మంది భక్తులు!


ఓ వైపు వారాంతం, మరోవైపు వేసవి సెలవులు ముగింపు దశకు రావడంతో తిరుమల గిరులు భక్త గిరులుగా మారాయి. మునుపెన్నడూ లేని రీతిలో అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల ద్వారా శనివారం నాడు 42 వేల మందికి పైగా భక్తులు తిరుమలకు చేరుకున్నారు. మెట్లపూజల దినాలను తీసేస్తే, తిరుమలకు అత్యధికులు నడిచి వచ్చిన రికార్డు ఇదేనని టీటీడీ వర్గాలు వెల్లడించాయి. ఇక కొండపై భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోగా, వెలుపలకు కిలోమీటర్ల కొద్దీ క్యూ పెరిగిపోయింది. సాధారణ భక్తులకు తోడు, తిరుపతిలో జరుగుతున్న తెలుగుదేశం మహానాడుకు వచ్చిన కార్యకర్తలు, నేతలు కూడా స్వామివారి దర్శనానికి పోటెత్తుతుండటంతో రద్దీ అధికంగా ఉందని అధికారులు తెలిపారు. స్వామివారి దర్శనం కోసం 50 వేల మందికి పైగా వేచి చూస్తున్నట్టు తెలుస్తోంది. క్యూలైన్లలోని వారికి ఇబ్బంది కలుగకుండా అన్న ప్రసాదాలతోపాటు పాలు, మజ్జిగ అందిస్తున్నట్టు టీటీడీ వెల్లడించింది.

  • Loading...

More Telugu News