: క్షమాపణ చెప్పి, వివరణ ఇచ్చిన ఫరూఖ్ అబ్దుల్లా
జాతీయ గీతానికి అవమానంపై జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా క్షమాపణలు చెప్పి వివరణ ఇచ్చారు. జాతీయ గీతాలాపన సందర్భంగా తాను కావాలని ఫోన్ మాట్లాడలేదని, చాలా ముఖ్యమైన ఫోన్ కాల్ వచ్చినందున మాట్లాడాల్సి వచ్చిందని అన్నారు. విదేశాల్లో ఉంటున్న తన బంధువు అనారోగ్యానికి గురయ్యారని, దీంతో ఎమర్జెన్సీ కాల్ మాట్లాడాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. అందుకే ఆ సమయంలో ఫోన్ లో మాట్లాడాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. జాతీయ గీతం ఆలాపన సమయంలో ఎలా వ్యవహరించాలో తనకు తెలుసని, తాను నిలబడే ఉన్నానని, అయితే తప్పనిసరి పరిస్థితుల్లోనే మాట్లాడాల్సి వచ్చిందని, తాను అలా చేయడం వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని ఆయన కోరారు. కాగా, మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారానికి హాజరైన ఫరూఖ్ అబ్దుల్లా జాతీయ గీతాలాపన సమయంలో ఫోన్ లో మాట్లాడుతూ మీడియా కంటబడడంతో వివాదం రేగిన సంగతి తెలిసిందే.