: చిరంజీవి, దాసరి నారాయణరావుపై విరుచుకుపడ్డ మంత్రి నారాయణ
కాపుల ఉద్యమానికి మద్దతు తెలుపుతోన్న సినీనటుడు, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావుపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ మండిపడ్డారు. ఈరోజు హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర మంత్రులుగా బాధ్యతలు నిర్వహించిన ఈ ఇద్దరు నేతలు కాపు వర్గానికి ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. కాపుల సంక్షేమాన్ని పట్టించుకోని ఇటువంటి నేతలను దగ్గరకు చేర్చుకోవద్దని ఆ వర్గ ప్రజలకు సూచించారు. దాసరి నారాయణరావుని జగన్ కొన్ని రోజుల ముందు కలిశారని, ఇప్పుడు ముద్రగడ కూడా కలిశారని నారాయణ అన్నారు. జగన్ చెప్పినట్లే ముద్రగడ పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. గత ఎన్నికల్లో కాపులు చిరంజీవిని నమ్ముకుంటే వారిని నట్టేట ముంచి సదరు నేత కాంగ్రెస్‌లో కలిసిపోయారని ఆయన అన్నారు. కాపులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కాపులకిచ్చిన హామీలన్నిటినీ తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆయన అన్నారు.