: చేతనైతే సహకరించండి.. లేకపోతే ఇంట్లో కూర్చోండి: చంద్రబాబు ఆగ్రహం
వచ్చేనెలలోనే హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ కార్యాలయాలన్నిటినీ అమరావతికి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ‘అమరావతి ఒక డ్రీమ్ క్యాపిటల్’ అని ఆయన వ్యాఖ్యానించారు. తిరుపతిలో నిర్వహిస్తోన్న టీడీపీ మహానాడులో ఆయన ఈరోజు మాట్లాడారు. ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తామని ఉద్ఘాటించారు. ‘ఇక్కడ నిర్మించ తలపెడుతోన్న ఎక్స్ ప్రెస్ వేను ప్రతిపక్షనేత అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు’ అని చంద్రబాబు విమర్శించారు. ‘ఆంధ్రా ప్రజల కలల రాజధాని అమరావతిని తాము నిర్మిస్తోంటే ప్రతిపక్షనేత తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారు, ఎన్నో విమర్శలు గుప్పిస్తున్నార’ని ఆయన అన్నారు. ‘వాటిని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘రాజధాని కట్టే అవకాశం రావడం ఒక అదృష్టం’ అని చంద్రబాబు అన్నారు. ‘చేతనైతే సహకరించండి, లేకపోతే ఇంట్లో కూర్చోండి’ అని ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే గొప్ప రాజధానిగా అమరావతిని నిర్మిస్తామని అన్నారు. రాజధానికి పెట్టిన అమరావతి పేరును ఒక్కరు కూడా వ్యతిరేకించలేదని ఆయన అన్నారు. ఇండియా అంటే అమరావతే గుర్తుకు వచ్చేలా రాజధాని నిర్మాణం జరుగుతుందని చెప్పారు. అమరావతిని గ్రీన్ ఫీల్డ్ సిటీగా నిర్మించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఎవ్వరు అడ్డుపడినా అమరావతి నిర్మాణం అద్భుతంగానే జరుగుతుందని పునరుద్ఘాటించారు. ‘రైతులకు అన్యాయం జరగదు, నష్ట పరిహారం ఇస్తాం’ అని ఆయన అన్నారు. రాజధానితో పాటు అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలన్నారు. అమరావతిలో 220 కిలో మీటర్ల ఔటర్ రింగ్ రోడ్ గురించి ఆలోచన చేస్తున్నామని తెలిపారు.