: మహానాడుకు వెళ్లని కారణం చెప్పిన నందమూరి హరికృష్ణ
తిరుపతిలో నిన్న ఉదయం అట్టహాసంగా ప్రారంభమైన టీడీపీ వార్షిక వేడుక ‘మహానాడు’లో ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ కనిపించకపోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు వైఖరితో విభేదించిన కారణంగానే హరికృష్ణ మహానాడుకు దూరంగా ఉన్నారన్న వాదన కూడా వినిపిస్తోంది. అయితే నేటి ఉదయం హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ కు కుటుంబసభ్యులతో కలిసి వచ్చిన హరికృష్ణ తన తండ్రికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయనను మీడియా ప్రశ్నించింది. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉండి కూడా మహానాడుకు వెళ్లకపోవడానికి గల కారణమేమిటని హరికృష్ణను మీడియా ప్రతినిధులు దాదాపుగా నిలదీసినంత పనిచేశారు. అయితే మీడియా ప్రశ్నలకు శాంతంగానే స్పందించిన హరికృష్ణ... అసలు తానెందుకు మహానాడుకు వెళ్లలేదన్న కారణాన్ని చెప్పేశారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కు నివాళి అర్పించడం కంటే ఉన్నతమైన కార్యక్రమం మరొకటి ఉంటుందా? అని ఎదురు ప్రశ్నించిన ఆయన... తన తండ్రి సమాధి వద్ద నివాళి అర్పించాలన్న ఉద్దేశంతోనే మహానాడుకు వెళ్లలేదని తెలిపారు. హరికృష్ణ స్పష్టమైన సమాధానంతో ఆయన మహానాడుకు గైర్హాజరవడంపై వెల్లువెత్తిన విమర్శలకు ఫుల్ స్టాప్ పడిపోయింది.