: సేవల్లో రైల్వేలు భేష్... మోదీ 'మానస పుత్రిక'లకు స్పందన అంతంతే: ఎన్డీయే స్వీయ సర్వేలో ఆసక్తికర అంశాలు
రెండేళ్ల పాలనపై ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం స్వయంగా ఓ సర్వేను నిర్వహించుకోగా, మోదీ మానస పుత్రికలైన పథకాలు స్వచ్ఛ భారత్, డిజిటల్ ఇండియా తదితరాలకు స్వల్ప స్కోర్ లభించింది. పథకాలకు రేటింగ్ ఇవ్వాలని కోరుతూ, 30 ప్రశ్నల జాబితాతో ప్రజలను ప్రశ్నించగా, సేవలు అందించడంలో రైల్వే శాఖ భేషని వెల్లడైంది. నల్లధనం విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అత్యధికులు వెల్లడించగా, స్వచ్ఛ భారత్, డిజిటల్ ఇండియాలు కిందనుంచి రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు 74 శాతం మంది కితాబిచ్చారు. ఆయన పనితీరుకు 5 స్టార్ రేటింగ్ కూడా లభించింది. మొత్తం 15 స్కీముల గురించి ప్రశ్నించగా, రవాణా మంత్రి నితిన్ గడ్కరీ విధానానికి 65.8 శాతం మంది మద్దతు పలికి 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. ప్రభు, గడ్కరీ పనితీరుకు ఒక్కరు కూడా సింగిల్ స్టార్ ను ఇవ్వలేదు. ఇతర మంత్రుల్లో సుష్మా స్వరాజ్ నేతృత్వంలోని విదేశాంగ శాఖ పనితీరుకు 63 శాతం మంది, పీయుష్ గోయల్ నిర్వహిస్తున్న విద్యుత్ శాఖకు 57 శాతం మంది 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. ఇక మోదీ స్వయంగా ఆలోచించి ముందుకు తెచ్చిన మేకిన్ ఇండియాకు 53 శాతం మంది, ఇండియాలో వ్యాపారం తేలికగా మారిందని 49 శాతం మంది పేర్కొన్నారు. అవినీతి కొద్దిగా తగ్గిందని 48 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇంకా ఈ సర్వేలో భాగంగా ప్రధాన మంత్రి ముద్రా యోజన పథకంలో చిన్న వ్యాపారులకు రూ. 10 లక్షల రుణం లభిస్తుందని తెలుసా? ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన కింద 5 కోట్ల మంది పేదలకు వంటగ్యాస్ ఉచితంగా లభిస్తుందని తెలుసా? వంటి ప్రశ్నలకు 'యస్ ఆర్ నో' సమాధానాలు అడిగారు. ప్రతి స్కీముకూ 1 నుంచి 5 స్టార్ రేటింగ్ ను అడిగారు.